బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం..!

ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. కొన్నిచోట్ల బీజేపీ ఆఫీసుల ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ జోలికొస్తే వదిలేది లేదని హస్తం నేతలు హెచ్చరించారు. ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీజేపీ దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు.

 

హైదరాబాద్‌లో బీజేపీ ఆఫీస్ ముట్టడి

 

మహిళా కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకుని బీజేపీ తెలంగాణ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీపై తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

 

బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వైఖరికి నిరసనగా గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు హస్తం నాయకులు. ఎమ్మేల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, వీహెచ్, పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగించింది. రోహిన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఉగ్రవాదుల్లా మాట్లాడుతున్నారని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దానం నాగేందర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీని చంపుతామని అంటున్నారని, వారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్ గాంధీలకు ప్రధాని పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ దేశానికి అరిష్టం అంటూ ఫైరయ్యారు. వీహెచ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న అమిత్ షా ఎందుకు రాలేదని అడిగారు. రాహుల్ గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదని, అమిత్ షాని ఏదో అన్నామని ఢిల్లీ నుండి పోలీసులు వచ్చి తమ వాళ్లపై కేసులు పెట్టారని, ఇప్పుడు రాహుల్ గాంధీని తిట్టినందుకు మేం పెట్టిన కేసులపై ఇక్కడి పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందేని డిమాండ్ చేశారు.

 

హత్యకు కుట్ర

 

రాహుల్ గాంధీపై హత్యకు లేదా గాయపరిచేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, ఆ పార్టీ మిత్రపక్షాల నాయకులు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటోంది. ఇదే క్రమంలో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ ఈ కంప్లయింట్ చేశారు. ఇదే ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు కూడా పంపింది కాంగ్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *