ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి..?

ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో నూతన సీఎంను ఎన్నుకున్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి మర్లేనా పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. అందుకు శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది. ఈరోజు సాయంత్రం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు ఆప్ నేతలకు సాయంత్రం 4.30 గంటలకు ఎల్జీ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు ఢిల్లీ రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. గత శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్.. ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా మారింది. ఈ కేసులో తనని తాను నిర్దోషిగా నిరూపించుకున్నాకే పదవి చేపడుతానన్న కేజ్రీవాల్.. నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 

ఎన్నికల సమయంలో తాను మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని, ఇంటింటికీ తిరిగి తన నిజాయితీ ఏంటో ఓట్లు వేయడంతో నిరూపించుకుంటానన్నారు. కేజ్రీవాల్ రాజీనామా వెనుక పెద్ద స్కెచ్చే ఉందని రెండ్రోజులుగా చర్చ మొదలైంది. జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు రాగా.. బెయిల్ పై బయటికొచ్చాక రాజీనామా ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 

కాగా.. ఈ నెల 26,27 తేదీల్లో ఢిల్లీలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమయంలోనే ఆతిషీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ నేతలు తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం ఎవరికి ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నవంబర్ లోనే ఎన్నికలు జరిగితే.. బహుశా ఆ పదవి ఎవరికీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఈసీ మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

ఆతిషీ మర్లేనా 1981 జూన్ 8న విజయ్ సింగ్ – త్రిప్తా వాహీ దంపతులకు జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ వృత్తిరీత్యా ప్రొఫెసర్లు. ఆమె మొదటి పేరు మార్లేనా. 2018లో నేషనల్ ఎలక్షన్స్ కు ముందు తనపేరును ఆతిషిగా మార్చుకున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ పైనే మాస్టర్స్ డిగ్రీ

పూర్తి చేసిందామె.

 

2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆమె.. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. సమీప బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ పై 11,422 ఓట్ల తేడాతో గెలిచారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ లు అరెస్ట్ అవ్వడం, వారి రాజీనామాల పరిణామాల తర్వాత.. ఆతిషీకి కేబినెట్ లో చోటు దక్కింది. విద్య, స్త్రీ-శిశు సంక్షేమం, సంస్కృతి, పర్యాటకం, ప్రజా పనుల శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

 

1998లో సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఢిల్లీకి 1998 డిసెంబర్ 3 నుంచి 2008 నవంబర్ 30 వరకూ.. మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయం సాధించి 15 సంవత్సరాల 25 రోజులపాటు మహిళా సీఎంగా పనిచేసిన రికార్డు ఆమెకే సొంతం. ఇప్పుడు ఢిల్లీకి మూడవ మహిళా సీఎంగా ఆతిషీ నియామకం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *