పక్షపాతంగా హైడ్రా కూల్చివేతలు..–: బీజేపీ నేతలు..

హైడ్రా కూల్చివేతలు పక్షపాతంగా ఉన్నాయని, హైడ్రాతో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఓ వర్గం ప్రజలపైనే కూల్చివేతలు కొనసాగుతున్నాయని, పాతబస్తీలో ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు. తాజాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

 

హైడ్రా కూల్చివేతల పేరుతో ఆరు గ్యారంటీలను పక్కదొవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో ఇటీవల మృతి చెందిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేత కార్మికుల కరెంట్ బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసం చేశాయని మండిపడ్డారు.

 

నేత కార్మికులకు 50 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి.. రెండు పార్టీలు మాట తప్పాయన్నారు బండి సంజయ్. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తమపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారన్నారు.

 

పెద్దోళ్లను కొట్టి చిన్నొళ్లకు ఇవ్వాలన్నారు బండి సంజయ్. తెలిసి తెలీక కొందరు ఇళ్లు కట్టుకున్నారు. వాటిని కూల్చేస్తే ఎలా? జన్వాడ ఫాంహౌస్ మీద డ్రోన్ ఎగరేసి జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. సకలం చెరువులో కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని రేవంత్ సర్కారును నిలదీశారు. రైతు రుణమాఫీ రూ. 47 వేల కోట్లు చేస్తామని చెప్పి.. రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.

 

ఒవైసీ విద్యాసంస్థలకే మినహాయింపులా?

 

హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని.. రంగనాథ్ కమిషనరా? పొలిటికల్ లీడరా? అని ప్రశ్నించారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా? అని నిలదీశారు. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని రంగనాథ్‌పై విమర్శలు గుప్పించారు.

 

హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా? అని మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓవైసీకి ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పడు.. మిగితా వారికి, ఎన్ కన్వెన్షన్ కు ఎందుకు సమయం ఇవ్వలేదనిప్రశ్నించారు.

 

ఓల్డ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం రేవంత్ సర్కారుకు లేదా? ఓవైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా? ఆయన ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే విద్యార్థులు ఉన్నారా? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదని ఆరోపించారు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కూల్చుతున్నారా? అనే అనుమానం కలుగుతుందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *