మంత్రివర్గంలోకి ఆరుగురికి మంత్రులకు అవకాశం..? సీఎం ఢిల్లీ పర్యటనపై టీపీసీసీ నేతల్లో ఆశలు..!

తెలంగాణలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. గురువారం రాత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ‌తో ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి నేడు పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఆషాడం కారణంగా గతంలో వాయిదా పడిన క్యాబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికతో పాటు పలు కీలక అంశాల మీద ఈ పర్యటనలో ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇప్పటికే టీపీసీసీ ఒక నిర్ణయానికి వచ్చిందని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పర్యటనలో టీపీసీసీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

 

కేబినెట్ విస్తరణ

గత డిసెంబరు 7న ఏర్పడిన తెలంగాణ మంత్రివర్గంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులున్నారు. పార్లమెంటు ఎన్నికలు, కొత్త నేతల చేరికలు, ఆషాడమాసం కారణంగా నేటి వరకు మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. కాగా, ప్రస్తుతం ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిథ్యం లేనందున ఈసారి ఆ జిల్లాలకు ప్రాముఖ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ లేదా ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఆమిర్ అలీఖాన్, రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, నల్లగొండలో బాలూ నాయక్ లేదా రాంచందర్ నాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం చివరి నిమిషంలో కొన్ని మార్పులకు అవకాశం ఉండొచ్చని, పదవి దక్కని వారికి చీఫ్ విప్ పదవి ఇస్తారనే ప్రచారమూ నడుస్తోంది.

 

పీసీసీ ఎంపిక

ఈ పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక మీద కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. ఈ పదవికి మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌, మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్లు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈసారి ఈ పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఒకరికి దక్కనుందని తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులకూ ఆ పర్యటనలో ముఖ్యమంత్రి అధిష్టానం చేత ఆమోదముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తోంది.

 

కులగణనపై..

ఈ పర్యటనలో తెలంగాణలో కులగణనపై కూడా సీఎం అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన పూర్తిచేయాలా.. ఎన్నికల తర్వాత చేయాలా అనేదానిపై అగ్రనేతలతో చర్చించనున్నారు. కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌తో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.

 

అగ్రనేతలకు ఆహ్వానం..

గతంలో రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినందున కృతజ్ఞత సభ పేరుతో వరంగల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పీసీసీ భావిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అలాగే సచివాలయం ఎదురుగా భారీ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్‌ను రేవంత్ ఆహ్వానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *