మహిళల రక్షణకు ప్రత్యేక బడ్జెట్..!

మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి సీతక్క. మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శిక్ష, శిక్షణ ఏకకాలంలో అమలయితేనే క్రైమ్ రేట్ తగ్గుతుందన్న ఆమె, మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వ్యాఖ్యానించారు. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, మత్తు బానిసలపై నిఘ పెంచుతామని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు కూడా అభద్రతాభావంలో ఉండటం బాధాకరమని, మహిళా డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.

 

‘‘మంత్రులు, ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తాం. మహిళా భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. అమ్మాయిలు మహిళల భద్రత మీ బాధ్యత అని అన్ని విద్యాసంస్థలకు తెలియ చెబుతాం. అందర్నీ గౌరవించేలా పాఠశాలల్లో పాఠాలు బోధిస్తాం. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పెంచేలా చర్యలు చేపడతాం. మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం ప్రారంభించిన టీ సేఫ్ యాప్ బాగా పనిచేస్తోంది. టీ సేఫ్ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఈ యాప్‌ను ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. టీ సేఫ్ యాప్‌నకు మరింత ప్రచారం కల్పిస్తాం. ఆటోలు, క్యాబ్‌ల్లో టీ సేఫ్ నెంబర్లను ప్రచారం చేస్తాం. మహిళా భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను త్వరలో సీఎంకు సమర్పిస్తాం’’ అని తెలిపారు సీతక్క.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *