పంచాయతీల్లో మలిదశ విప్లవం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

పంచాయతీల్లో మలిదశ విప్లవం ఉంటుందని జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజు మా చిత్తశుద్ధి ఏంటో చూపించామని, దాని కొనసాగింపుగా గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మన గ్రామాలను మనమే పరిపాలించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

 

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా గ్రామాలు బాగుపడ్డాయని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సోషల్ ఆడిట్ కోసం పోలీసు ఉన్నతాధికారి సేవలు వినియోగించుకుంటామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారిని సైతం గతంలో బెదిరింపులకు గురిచేశారన్నారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసే కొద్ది చాలా విషయాలు బయటపడుతున్నాయని చెప్పారు.

 

గ్రామాభివృద్ధి కోసం పారదర్శకంగా పనిచేస్తామని, రేపు దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం 87 రకాల పనుల కోసం రూ.4,500కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ పనులకు సంబంధించి గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తామన్నారు. దాదాపు 9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కాగా, గతంలో గ్రామాల కోసం ఖర్చు చేయని నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.

 

ఫార్మా సెజ్‌లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా వరకు కంపెనీల్లో రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. సేప్టీఆడిట్ చేయమని అన్ని కంపెనీలను కోరామన్నారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీల విషయంలో ఎక్కువగా ఉందన్నారు. పొల్యూషన్ ఆడిట్ జరగాలని చెప్పామని, కానీ మా కంపెనీ మూసేస్తారా? అనే భయంలో కంపెనీ యాజమాన్యాలు ఉన్నాయన్నారు.

 

ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పామన్నారు. సెప్టెంబర్ లో విశాఖ ప్రాంతాల్లో భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. సంతాపం ప్రకటించి పరిహారం ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రతి కార్మికుడు ప్రాణ రక్షణ ముఖ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *