నేడు భారత్‌ బంద్‌..!

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ‘ది రిజర్వేషన్ బచావో సంఘర్స్ సమితి’ బంద్ కు పిలుపి ఇవ్వగా..పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు బీఎస్పీ మద్దతు పలికింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఉదయమే ఆర్టీసీ బస్సులు రోడ్లపై రాకుండా అడ్డుకుంటున్నారు. కాగా, బంద్ నుంచి అంబులెన్స్, అత్యవసర సర్వీసులు, ఆస్పత్రులు, వైద్య సేవలు, ఫార్మసీ, పోలీస్ సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.

 

భారత్ బంద్‌లో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ విధానానికి లోబడి ఉప కులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పిస్తూ ఈనెల 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

 

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఈ బంద్ కు రాజకీయ పార్టీలతోపాటు సామాజిక సంస్థలు మద్దతు తెలుపనున్నాయి. ఇప్పటికే పోలీసులు సైతం భద్రతను పెంచారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్చలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రజల భద్రత కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేయనున్నారు. దీంతోపాటు పలు కార్యాలయాలు సైతం మూసివేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్‌కు కొన్ని సంఘాలు మద్దతు పలికాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్సుల నుంచి బస్సులు రాకుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య, రవాణా సంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *