బస్సులో జన్మించిన చిన్నారి.. ఊహించని బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ..

టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేలా బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రాఖీ పండుగ రోజు అనగా సోమవారం గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు, ఆ చిన్నారికి పుట్టినరోజు కానుకగా ఉచిత బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఇటు ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు కూడా శుభవార్త చెప్పింది. డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఇచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నది.

 

అదేవిధంగా, బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు వచ్చిన నేపథ్యంలో ఆమెకు కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం నగదు బహుమతులను అందజేశారు.

 

ఇదిలా ఉంటే.. జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే గర్భిణీ మహిళ సోమవారం బస్సులో గద్వాల నుంచి వనపర్తి ఆసుపత్రికి కాన్పు కోసం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఉదయం 8 గంటల సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆ విషయాన్ని కండక్టర్ భారతికి తెలియజేసింది. వెంటనే భారతి.. డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చింది. అనంతరం ఆయన సూచనల మేరకు వనపర్తి మండలం నాచహళ్లి గ్రామం వద్ద బస్సు నిలిపి, బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశారు. ఈ విషయాన్ని గమనించిన హైదరాబాద్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న అలివేలు మంగమ్మ కూడా అదే బస్సులో ప్రయాణిస్తుండడంతో ఆమె కూడా వారికి సాయం చేసింది. దీంతో వారంతా ఆమెకు క్షేమంగా ప్రసవం చేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *