జగన్‌కు డేంజర్ బెల్..సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సీబీఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి గెజిట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండీషన్‌ను గెజిట్‌లో యాడ్ చేసింది. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

 

ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్ లో పేర్కొంది. తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతిచ్చినట్టయింది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు.

సీబీఐకు ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ప్రభుత్వం సీబీఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ లేకుండా చేశారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం. మరోవైపు జగన్‌ను ఇరుకున పెట్టేందుకే సీబీఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారని మాటలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో ఉంది. దీని కారణంగానే సీబీఐకి అనుమతి ఇస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *