సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానివారికి త్వరలోనే రుణమాఫీ అవుతుంది..–: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్ రావు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటు బీజేపీ నేతలపై కూడా వారు సీరియస్ అయ్యారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘రుణమాఫీపై బావబామ్మర్దులు గోబెల్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండ మానేసి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరికీ రుణమాఫీ చేసి తీరుతాం. ప్రతిపక్షం దుష్ర్పచారం చేస్తోంది. అర్హులైన అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతుల మేలు కోసం పదేళ్లలో కేంద్రం ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. స్వతంత్ర భారతంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలగాణకే దక్కుతుంది.

 

అప్ డేట్ డేటా ఉన్న రైతులందరికీ రుణమాఫీ అయ్యింది. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానివారికి త్వరలోనే రుణమాఫీ అవుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. బీఆర్ఎస్ నాలుగుసార్లు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. గత ప్రభుత్వం క్రాప్ ఇన్స్యూరెన్స్ లేకుండా చేసింది. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. అంత అప్పుల భారం ఉన్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోంది.

 

లక్షా 20 వేల ఖాతాల ఆధార్ నెంబర్ లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది. లక్షా 61 వేల అకౌంట్ లలో ఆధార్ కు పాస్ బుక్ పేరు కు మిస్ మ్యాచ్ ఉంది. లక్షా 50 వేల అకౌంట్ ల లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి. 4 లక్షల 83 వేల అకౌంట్ లకు రేషన్ కార్డు లేని ఖాతాల వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. 8 లక్షల అకౌంట్ లకు రూ. 2 లక్షల కంటే రుణాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేశాం.

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఈసారి నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తాం. రైతు రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుంది. రైతులను బీజేపీ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నడూ రుణమాఫీ మాట మాట్లాడలేదు.’ అంటూ మంత్రులు పేర్కొన్నారు.

 

‘బీజేపీ, బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలూ రుణమాఫీని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణలో రుణమాఫీ చేసింది. దేశంలో ఏ ప్రభుత్వం ఇలా రుణమాఫీ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *