ఏపీలో రూటు మార్చిన వైసీపీ..! ఈసారి టార్గెట్ బీజేపీ..?

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా బీజేపీపై సైలెంట్ అయిన వైసీపీ.. క్రమంగా బాణాలు ఎక్కుపెడు తోంది. ఏపీ నేతలను మాత్రమే కాదు.. బీజేపీ పెద్దలపై అస్త్రాలు సంధిస్తోంది. బుధవారం మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది.

విజయవాడలో మీడియా ముందుకొచ్చారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కామన్ పాయింట్‌ని ఎత్తుకున్నారు. ఈ వ్యవహారంలో కూటమి పార్టీలను ఆయన టార్గెట్ చేశారు. నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజ్ లను వెంటనే ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు.

కేంద్రం నుంచి వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామంటున్నారని గుర్తు చేశారు వైసీపీ నేత. మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రజల సొమ్ము కావాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటెజ్ సొమ్ము ఇస్తున్నారా? పవన్ సినిమాల్లో వచ్చిన డబ్బు ఇస్తున్నారా? మోదీ-అమిత్ షా-సత్య కుమార్ జేబులోంచి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్‌లో అమ్ముతుంటే నియంత్రించలేకపోతున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లను అమ్ముకోవచ్చని ప్రభుత్వ పెద్దలు ఎలా చెబుతారు, లక్షలు వసూలు చేసే నారాయణ-చైతన్య కాలేజీలను మీరు నియంత్రించగలిగారా? ఇంతమంది చెబుతున్నా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు-పవన్-బీజేపీ కలిసి కూటమి కట్టారని పేర్ని, కేంద్రంలో మేమే.. రాష్ట్రంలో మేమే అని అంటున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రానికి ఏదో ఊడ బొడుస్తామని చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆరోపించారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని, వచ్చిన నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బరి తెగించి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని, సమాజ హితం కోరే అనేకమంది వారిస్తున్నా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మే ప్రయత్నాలు మాను కోవాలన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడానికి మీరెవరు? 66 ఏళ్ల పాటు రాసిచ్చేస్తామంటున్నారని, అప్పటికి బ్రతికుండేదెవరు పోయేదెవరు? చంద్రబాబు ప్రభుత్వానికి ఇంత బరి తెగింపు ఎందుకని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎమ్మెల్యేల సిఫార్సులుంటే తప్ప అరకొర వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తే పేదలకు వైద్యం అందుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు వైద్యం అందాల్సిన అవసరం లేదా? చంద్రబాబు, లోకేష్, సత్యకుమార్ యాదవ్ అనారోగ్యం వస్తే హెలికాప్టర్లు వేసుకుని హైదరాబాద్ వెళ్తారా? పవన్ కళ్యాణ్‌కు నొప్పి వస్తే ముంబై వెళ్తారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

పేదోడి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. మెడికల్ కాలేజీలను మీరు, మీ తాబేదార్లు, బినామీలు కలిసి దోచుకోవాలని చూస్తే ఊరుకోమని, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్లకు వెళ్లాలని చూస్తున్నారని, వెనక్కి తగ్గే వరకూ మా పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యవహారం ఇప్పటిది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో దీనిపై రచ్చ చేసింది వైసీపీ. అప్పుడు వీడియోలు బయట పెట్టేసరికి సైలెంట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు తెరపైకి అదే అంశాన్ని తీసుకొచ్చిందని కూటమి నుంచి బలంగా వాయిస్ రైజ్ అవుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మెల్లగా బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.