కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపాలి..! కవిత సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన కవిత, తన భర్తతో కలిసి పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ప్రత్యేకంగా కెనాల్ ఉందా లేదా అనే విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేయాలని కవిత ప్రశ్నించారు. మౌనంగా ఉన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆమె తేల్చిచెప్పారు. ప్రజల తరఫున తప్పులను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తుంటే, తనపై ఎదురుదాడి చేయడం సరైంది కాదన్నారు.

తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ కవిత తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు. “నేను.. నా అఫిడవిట్‌లో చూపినదానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. ప్రజలకు రాసిస్తా” అని ఆమె స్పష్టం చేశారు.