ఎట్టకేలకు ఏపీలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు చెప్పినట్టు మాదిరిగానే నవంబర్ 11న పార్టీ పేరు, జెండాను వెల్లడించారు. పరివర్తన రాజనీతి పార్టీ-పీఆర్పీ అనే పేరు ప్రకటించారు. జెండా కలర్ సగం కాషాయం, మరో సగం తెలుగు రంగుతో ఉంది. మధ్యలో అశోక చక్రంతో జెండా ఉంది. దేశం కోసం, ధర్మం కోసం అనే చిన్న ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు పీఆర్పీ చీఫ్.
నేను పదవుల భిక్ష అడగలేదు.. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదన్నారు. రాజకీయాల్లో విధేయత ఉండాలే కానీ బానిసత్వం కాదు అన్నది నా ఉద్దేశంగా చెప్పారు. 2019లో వైసీపీకి ప్రజలు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని, 2024 లో కేవలం 11 స్థానాలకు దించేశారన్నారు. ప్రజలు మీ అహంకారాన్ని తిరస్కరించారన్నారు. ప్రశ్నించే గుణాన్ని సహించని మీ రాజకీయ సంస్కృతి అని అన్నారు. ప్రజలు-నాయకుడికి మధ్య దూరం పెరిగితే చివరకు ఆ ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారన్నారు.
వైసీపీ నిర్మాణంలో ఇటుక ఇటుక పేర్చి నిర్మించటంలో నా కృషి ఎంతో ఉందన్నారు. నాకు పదవులు దానం చేశామని విమర్శిస్తున్నారని, నా కష్టంతో నా నిబద్ధతతో ఎంపీగా ఎదిగానన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏపీ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతిలో లేదన్నారు. ఏ ఒక్కరూ రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చలేరన్నారు. అంతా ప్రజల చేతిలో ఉందన్నారు. ఓటుతో ప్రజల పాత్ర ముగిసిపోదన్నారు. ప్రభుత్వం ఏదైనా చేసిన మంచి పనులే చెబుతాయన్నారు. ప్రశ్నించడం అనేది ప్రజాస్వా్మ్యంలో ప్రజలకు ఉన్న హక్కు అని చెప్పారు.
పీఆర్పీ పార్టీ మీకు ఇంకొక నాయకుడ్ని ఇవ్వడానికి కాదని, యువతలో ఉండే నాయకత్వం లక్షణాలను పైకి తీసుకొచ్చి, యువతీ యువకులను నాయకులను చేయాలనే లక్ష్యంతో పరివర్తన రాజనీతి కీయ పార్టీని ప్రారంభించినట్టు తెలిపారు. మంచి పని ఎవరు చేసినా అభినంధించాలని, తప్పు ఎవరు చేనినా ఆధారాలతో ప్రశ్నించాలన్నారు. తాను సీఎం కావాలని ఏనాడూ కోరుకోలేదన్నారు. ప్రతీ సామాజిక వర్గానికి న్యాయం చేయడమే పీఆర్పీ ధ్యేయమన్నారు. వారసత్వ రాజకీయాలకు గుడ్ బై చెప్పాలన్నారు.
అప్పుడే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి. తనపై టీడీపీ, వైసీపీ సోషల్ మీడియాలు నెగిటివ్ ప్రచారం చేస్తు్న్నాయని దుయ్యబట్టారు. తాను జగన్ వదిలిన బాణమని ఒకరు చెబుతుంటే, మరొకరు బాబుకు అమ్ముడుపోయారని అంటున్నారని అన్నారు. తనపై విమర్శలు చేసేవారికి ఒక్కటే సమాధానమన్నారు. పీఆర్పీ ఎవరికీ బీ టీమ్ కాదని కుండబద్దలు కొట్టేశారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ కాదన్నారు. ఏపీ ప్రజల కోసం పుట్టిందన్నారు. 2029 ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామన్నారు.