దమ్ముంటే సభలో చర్చకు రండి..! రాహుల్‌కు సీతారామన్ సవాల్..

బహిరంగ చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిద్ధమా? అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. చర్చలకు సరైన వేదిక పార్లమెంట్ అని, సోషల్ మీడియా కాదని తేల్చిచెప్పారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె వరుస పోస్టులు చేశారు.

“రాహుల్ జీ, చర్చకు వేదికను ఎంచుకోమని మీరు ప్రధానిని కోరుతున్నారు. దానికి ఇప్పటికే ఒక వేదిక ఉంది, అదే పార్లమెంట్. దానికి మీరే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు” అని నిర్మల పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేద్దామని హోంమంత్రి అమిత్ షా సోమవారమే ప్రతిపాదించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. “సోషల్ మీడియాలో సవాళ్లు విసిరినంత ఉత్సాహం పార్లమెంటులో చర్చకు ఎందుకు చూపించడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. “సమాధానాలు డిమాండ్ చేసేటప్పుడు, వాటిని వినే బాధ్యత కూడా ఉంటుంది. ఎన్నోసార్లు మీరు, మీ పార్టీ సభ్యులు ప్రభుత్వం స్పందిస్తున్న సమయంలోనే సభ నుంచి వాకౌట్ చేశారు. అలాంటప్పుడు చర్చకు అంత ఆసక్తిగా ఉన్నామని ఎలా చెప్పుకుంటారు?” అని ఆమె నిలదీశారు.

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయని ఆమె విమర్శించారు. “మీకు చర్చపై నిజంగా అంత ఆసక్తి ఉంటే, ముందు పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేలా సహకరించవచ్చు కదా?” అని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నివాసంలో నిర్వహించిన “మాక్ పార్లమెంట్” కార్యక్రమాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. అది “మాక్ పార్లమెంట్” కన్నా “పార్లమెంటును అపహాస్యం చేయడం”లా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడేవారు ముందుగా ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించాలని హితవు పలికారు. “‘డరో మత్’ (భయపడొద్దు) అని మీరు అంటుంటారు కదా. అలాంటప్పుడు వాస్తవాలతో, ఆధారాలతో సభకు రండి, విమర్శలను ఎదుర్కోండి, సమాధానాలు వినడానికి కూర్చోండి” అని రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు.