ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న 4 వేల కోట్ల ప్రతిష్టాత్మక మూవీ రామాయణ. నమిత్ మల్హోత్రా , యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని దీపావళి 2026 కానుకగా నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మొదటి భాగాన్ని తీసుకురానున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రామాయణ సినిమా నుండి వరుస అప్డేట్స్ వస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
రెండు మూడు రోజులుగా వరుస అప్డేట్లతో సినిమాపై అంచనాలు పెంచుతున్న చిత్ర బృందం.. ఇప్పుడు మరో అప్డేట్ వదిలింది. రామాయణ సినిమాలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher)జటాయువు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో జటాయువవు రూపం విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారీ రెక్కలు విప్పి ఎగురుతున్న జటాయువు తో పాటు వెనుక భాగంలో కనిపిస్తున్న భారీ పక్షి ముఖం పోస్టర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రామాయణంలో జటాయువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణుడు అపహరించి, తీసుకెళ్తున్న సమయంలో అతడిని అడ్డుకునేందుకు జటాయువు ధైర్యంగా పోరాడుతుంది. విజయం సాధిస్తానని ఆశతో కాకుండా ధర్మం కోసం నిలబడిన వీరుడిగా జటాయువు పాత్ర నిలిచిపోతుంది. రావణుడి చేత రెక్కలు తెగిపడి నిస్సహాయ స్థితికి చేరుకుంటుంది. అలాంటి కీలక పాత్ర పోషించిన జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్ నటించబోతున్నట్లు మేకర్స్ విడుదల చేశారు. ‘జటాయువు: ది వింగ్స్ ఆఫ్ ధర్మ’ అంటూ ఈ పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన పోస్టర్లలో లారాదత్త మహారాణి కైకేయి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఐమాక్స్ తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలో కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉంటుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ మరో వారంలో ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది...
అనుపమ్ ఖేర్ తదుపరి చిత్రాల విషయానికే వస్తే ఖోస్లా కా ఘోస్లా 2 లో నటిస్తున్నారు. కల్ట్ కామెడీ క్లాసిక్ కి సీక్వెల్ గా రాబోతోంది ఈ చిత్రం. అలాగే సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఏ ప్రేమ్ మోల్ లియా అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితోపాటు ది ఇండియా హౌస్ , శ్రీరామ్ భూమి తో పాటూ మరో రెండు చిత్రాలలో నటిస్తున్నారు. ఇక మరోవైపు నిర్మాతగా, దర్శకుడిగా కూడా మరో 2 ప్రాజెక్టులు ప్రకటించడం గమనార్హం.