విశాఖ మేయర్ పీఠం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళా జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ప్రధాన పార్టీల్లో మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ పెరిగింది. ముఖ్యంగా టీడీపీలో మేయర్ సీటు కోసం పోటీ యమ జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతల కుటుంబాలకు చెందిన మహిళల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ కూడా రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న మహిళలను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జనసేన, బీజేపీ సైతం విశాఖ మేయర్ పీఠంపై కన్నేశాయి. అయితే కూటమిలో ఏ పార్టీకి మేయర్ అభ్యర్థిత్వం దక్కుతుంది. టీడీపీ ఆశావహుల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది. వైసీపీ నుంచి ఎవరు పోటీకి దిగుతారు. ప్రజాప్రతినిధుల భార్యలు, కుటుంబ సభ్యుల మధ్య సాగుతున్న ఈ రాజకీయ పోటీ ఎలాంటి మలుపులు తిరగనుంది.
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మహా నగరం ఇప్పుడు ఈ నగరానికి మేయర్ ఎవరు కాబోతున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జీవీఎంసీ మేయర్ పదవికి మహిళా జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావహుల సందడి మొదలైంది కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిత్వం కోసం పలువురు నేతల కుటుంబాలకు చెందిన మహిళల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య పేరు వినిపిస్తోంది. ఎంపీ ఎం. శ్రీభరత్ భార్య నందమూరి తేజస్విని, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పట్టాభి కుటుంబం నుంచి ఆశావహుల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అంతే కాకుండా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన పొంగూరు శరణి, పెందుర్తి టీడీపీ నేత గండి బాబ్జీ కుమారుడి భార్య జాగృతి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. దీంతో టీడీపీలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోపక్క జనసేన నుంచి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భార్య పేరు, ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్ పేరు వినిపిస్తున్నాయి. మాజీ కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ కూడా మేయర్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. బీజేపీ కూడా మేయర్ సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ భార్య పేరు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె శ్యామలా దీపిక పేరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబానికి చెందిన మహిళ పేరు చర్చలో ఉన్నాయి. అయితే, కూటమిలో విశాఖ మేయర్ అభ్యర్థిని ఏ పార్టీ నుంచి నిలబెట్టాలన్నది ఇంకా తేలాల్సి ఉంది.
వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కోడలు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ భార్య, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో వైసీపీ కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న మహిళలను రంగంలోకి దించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈసారి మేయర్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడంతో అభ్యర్థుల ఎంపిక మరింత కీలకంగా మారింది. కేవలం రాజకీయ కుటుంబ నేపథ్యమే కాకుండా నగర సమస్యలపై అవగాహన, ప్రజలతో అనుబంధం, అభివృద్ధి చేయగల సామర్థ్యం కూడా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. మొత్తానికి విశాఖ మేయర్ పీఠం కోసం టీడీపీలో అంతర్గత పోటీ, వైసీపీలో ఆశావహుల ప్రయత్నాలు, జనసేన–బీజేపీల వ్యూహాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రచారంలో ఉన్న పేర్లలో చివరకు ఎవరికి పార్టీలు అవకాశం ఇస్తాయి… కూటమి సీటు పంపకాల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది. అధికారిక ప్రకటనలు వచ్చేవరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.