భారతీయుడు ఈజ్ బ్యాక్..!

టాలీవుడ్ లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సినీ చరిత్రలోనే ఒక సంచలనం. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఇండియన్ 2’ మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా రిజల్ట్ చూశాక మూడో భాగంపై అందరూ ఆశలు వదిలేసుకున్నారు. కానీ, ఊహించని విధంగా ‘ఇండియన్ 3’ అప్‌డేట్‌తో మేకర్స్ మళ్లీ బజ్ క్రియేట్ చేశారు. అసలు ఈ సినిమాపై ఇప్పుడు ఎందుకంత ఆసక్తి నెలకొందో చూద్దాం..

నిరాశపరిచిన ‘ఇండియన్ 2’:
రెండేళ్ల క్రితం ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఇండియన్ 2’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాపరిచింది. సేనాపతి మళ్లీ వస్తున్నాడంటే శంకర్ అదరగొట్టేస్తాడని అందరూ భావించారు. కానీ సినిమా చూశాక ‘అరేయ్ ఇదేం సినిమా’ అంటూ ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ‘ఇండియన్ 3’ సినిమా రాకపోవచ్చని, పూర్తిగా ఆగిపోయిందని అంతా అనుకున్నారు.

అనుకోని విధంగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘ఇండియన్ 3’ని అధికారికంగా అనౌన్స్ చేసి ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. “సేనాపతి ఏమాత్రం సహనం లేకుండా తిరిగి వచ్చారు. ఇండియన్ 3 వార్ మోడ్‌లో పునరాగమనం మొదలైంది” అంటూ ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో పార్ట్ క్లైమాక్స్‌లో వచ్చిన క్లిఫ్ హ్యాంగర్ కొనసాగింపుగానే ఈ మూడో భాగం ఉండబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

మేజర్ హైలైట్స్‌గా బ్రిటన్ కాలం నాటి ఫ్లాష్‌బ్యాక్:
ఈ మూడో భాగంలో స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి మూలాలతో పాటు, బ్రిటిష్ కాలం నాటి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మూవీలో సేనాపతి పాత్రతో పాటు ఆయన తండ్రి వీరశేఖర బలరామ్ పాత్రలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇక అనిరుధ్ సంగీతం, భారీ తారాగణం ఈ సినిమాపై మళ్లీ అంచనాలను పెంచుతున్నాయి.రెండో భాగం ఇచ్చిన డిజాస్టర్ షాక్ నుంచి బయటపడి, మూడో భాగంతో శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ గట్టిగా ఉంటే ఈ సినిమాతో కమల్ – శంకర్ కాంబో మళ్లీ ట్రాక్‌లోకి రావడం ఖాయం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ రానుంది.

ఇక మొత్తానికి చూస్తే, ‘ఇండియన్ 2’ ఫెయిల్యూర్ తర్వాత అందరూ మర్చిపోయిన ‘ఇండియన్ 3’ ఇప్పుడు సంచలన అప్‌డేట్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. సేనాపతి ఏమాత్రం తగ్గకుండా వార్ మోడ్‌లో వస్తున్నానంటూ ఇస్తోన్న సంకేతాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఈ మూడో భాగం ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.