స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార-విపక్షాల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా విజయవాడ మేయర్ ఈసారి ఎవరి సొంతం అవుతుంది అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ కుర్చీపై వంగవీటి రాధా కన్నేసినట్టు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేటు సాధించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు. ముఖ్యంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ అవగాహనకు వచ్చినట్టు పార్టీ వర్గాల మాట. ఇటీవల ఇరువురు నేతలు దాదాపు రెండుగంటలపాటు అనేక అంశాలపై చర్చించడం, దానిపై ఓ కమిటీ వేయడం చకచకా జరిగిపోయింది.
అదే రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాదా సమావేశమయ్యారు. ప్రజారాజ్యంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తన మనసులోని కోరికను రాధా బయటపెట్టినట్టు తెలుస్తోంది. రాధా చెప్పిన విషయాలు క్షుణ్నంగా విన్న పవన్ కల్యాణ్, కూటమి కలిసి పోటీ చేస్తుండడంతో మూడు పార్టీలకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. తనకు మేయర్ కావాలని రాధా కోరినట్టు అందులోని సారాంశం.
మరో గంట తర్వాత సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. పవన్ భేటీలో చెప్పిన విషయాలను ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇంకా సమయం ఉందని, చూద్దామని ముఖ్యమంత్రి అన్నట్లు ఓ టాక్. విజయవాడ మేయర్ సీటుపై మంచి నిర్ణయం వస్తుందని చెప్పారట. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు దాదాపు ఖాయమయ్యే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. మరి రాధా ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం చంద్రబాబు టీడీపీ నుంచి పోటీ చేయాలని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల నేతలు రాధా పేరు ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా నిలబడితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ భావిస్తోందని టాక్. అందుకు సంబంధించి దాదాపుగా అభ్యర్థిని ఓకే చేశారని అంటున్నారు. దేవినేని అవినాష్‌కు ఆ సీటు ఇవ్వవచ్చని అంటున్నారు. అనుకున్నట్లుగా జరిగితే ఈసారి విజయవాడ రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కడం ఖాయమని అంటున్నారు.