తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఫ్యూచర్ సిటీలో ప్రముఖ విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో పాటు మరో నాలుగు అంతర్జాతీయ యూనివర్సిటీలు ఫ్యూచర్ సిటీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు సీఎస్‌కు తెలిపారు.
విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, పెట్టుబడులకు అవకాశం కల్పించడం, అనుమతులు సులభతరం చేయడం, విద్యా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను పాలసీలో చేర్చాలని సంజయ్ జాజు సూచించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతిపాదిత వర్సిటీల ప్రతినిధులతో చర్చలు జరిపి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నాటికి ఈ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇదే సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’పైనా సమీక్షించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశలవారీగా ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 డిసెంబర్ నాటికి 67 పాఠశాలలను పూర్తి చేయాలని, 2028 జూన్ నాటికి ఈ సంఖ్యను 87కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒక్కో పాఠశాలను సుమారు 26 ఎకరాల్లో నిర్మించనున్నారు. క్రీడా మైదానాలు, హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్లు, ఆధునిక వంటశాలలు, డిజిటల్ తరగతి గదుల వంటి సదుపాయాలు కల్పించనున్నారు. నిర్మాణ పనులను క్రమం తప్పకుండా సమీక్షించి, నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.