అక్టోబర్ 10న చలో ఢిల్లీ..! సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం..!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నాయకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆయన శుక్రవారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ ప్రకటన చేశారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలని కోరుకునే ప్రతి పౌరుడు ఈ శాంతియుత పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ వెనుక అసలు లక్ష్యం ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ పార్టీ’ అని దిప్కే దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలను ఖతమ్‌ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన బలాన్ని సీజేపీ నేత సౌరవ్ దాస్ ఖండించారు. ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయంగా అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం ముంబయిలో అభిజిత్ దిప్కే ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు భారీ స్థాయిలో విజయవంతమైంది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ తీవ్రమైన ఎండను, పోలీసు బారికేడ్లను సైతం లెక్కచేయకుండా వేలాది మంది యువతీ యువకులు శివాజీ పార్క్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిప్కే.. సీఈసీ దిగిరాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న జెన్ జీ (Gen Z) యువతంతా ‘చలో ఢిల్లీ’ నినాదంతో ముందుకు సాగుతుందని హెచ్చరించారు. ఇది ‘జంతర్ మంతర్ 2.0’ కు దారితీస్తుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీపై భారీ ఎత్తున నిరసన తెలిపిన 2 నెలలకే మళ్లీ రోడ్లపైకి రావాల్సి రావడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.

గత రెండేళ్లలో దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని దిప్కే ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య వ్యత్యాసాన్ని పెంచేందుకే జ్ఞానేష్ కుమార్‌ను నియమించారని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 40 లక్షల కొత్త ఓటర్లను చేర్చి అక్రమాలకు పాల్పడ్డారని ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలోనూ ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగించి గెలుపొందారని ఆరోపించారు. సీఈసీ వెంటనే రాజీనామా చేసి క్రిమినల్ విచారణను ఎదుర్కొనాలని.. 2025 ఓటర్ల జాబితాను నిలిపివేయాలని సీజేపీ నాయకుడు అజింక్య షిండే సైతం డిమాండ్ చేశారు.

ముంబయిలో సీజేపీ నిరసన కార్యక్రమానికి ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, దర్శకులు విశాల్ భరద్వాజ్, హన్సల్ మెహతా, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ, మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ హాజరై మద్దతు తెలిపారు. శివసేన (యూబీటీ), లెఫ్ట్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు (SFI, AISF) కూడా ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. చేతిలో త్రివర్ణ పతాకాలు, ‘జ్ఞానేష్ బ్రో, జస్ట్ రిజైన్’ వంటి ప్లకార్డులు పట్టుకుని యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.