ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆపండి.. హైకోర్టుకు విజయారెడ్డి.. విచారణ వాయిదా..

ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేస్తూ తమ క్లయింట్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ పాత పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

వాదనలు విన్న హైకోర్టు, ఈ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కోర్టు తాజా నిర్ణయంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక ప్రక్రియపై ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొంది.