రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను సమన్వయం చేయడం ద్వారా పేదలకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలనలో నాణ్యత, పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఐఐఎం, ఐఐటీల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో శిక్షణ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
బుధవారం ‘పేదల సేవలో – సంక్షేమ కార్యక్రమాల కన్వర్జెన్స్’ అనే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన జూమ్ వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి పేద కుటుంబానికి సగటున 4 నుంచి 5 పథకాలు అందుతున్నాయని, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం వంటి పథకాలన్నింటినీ సమన్వయం చేసి లబ్ధిదారులకు మరింత అండగా నిలవాలని సూచించారు.
పేదరికం, ఆర్థిక అసమానతలు లేని నియోజకవర్గాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. పీ4 (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్ అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఇందుకోసం సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు పీ4 కార్యక్రమం కింద చేయూతనిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పాలనలో సాంకేతికతను జోడించడం ద్వారా పౌర సేవలను మరింత సులభతరం చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. సేవలను సమర్థంగా అందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఉద్యోగికి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్లు, నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, తమ ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్‌కే అత్యంత ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.
డ్వాక్రా మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం ‘స్వయం బ్రాండ్’ను ప్రోత్సహిస్తున్నామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. పల్లె పండుగ-3.0 ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కల్పించబడతాయని, అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత తప్పనిసరి అని ఆదేశించారు. ఏటా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ‘స్వచ్ఛాంధ్ర అవార్డులు’ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లిని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపడమే తమ అంతిమ లక్ష్యమని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.