ఖైరతాబాద్ ఉపఎన్నిక.. రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం..!

ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక దాదాపుగా అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. బైపోల్ పై ఏఐసీసీ ఆరా తీసింది. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పై సుప్రీం కోర్టు కూడా అనర్హత వేటు వేయడంతో పూర్తి స్థాయి వివరాలను అందజేయాలని ఏఐసీసీ… రాష్ట్ర పార్టీకి ఆదేశాలిచ్చింది. ఇక ఖైరతాబాద్ ఖాళీ అయినట్లు కోర్టు ప్రకటించడంతో హస్తం పార్టీ అగ్రనేతలు ఉప ఎన్నిక కొరకు రంగంలోకి దిగారు.

నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, మారుతున్న సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలపై అధిష్టానం దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడి నుంచి ఏఐసీసీ నేతలు పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు సమాచారం. నియోజకవర్గంలో దానం నాగేందర్ ప్రభావం ఎంత? పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది? అన్న అంశాలపై క్షేత్రస్థాయి రెస్పాన్స్ ను అధిష్టానం సేకరిస్తుంది. గత పొరపాట్లు పునరావృతం కాకుండా రెండు మూడు స్వతంత్ర సంస్థల ద్వారా సర్వే నిర్వహించి, నివేదికలు పరిశీలించిన తర్వాతే టికెట్ కేటాయించాలని నిర్ణయించారు.

ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో ఎవరెవరు ఉన్నారు, వారి ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశాలపై కూడా సమగ్రంగా స్టడీ చేయాలని ఏఐసీసీ కార్యాలయం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆశావహుల పేర్లపై, పార్టీ గుర్తుపై రెండు వేర్వేరుగా సర్వేలు, ఓవరల్ గా ఒకటి ప్లాష్​ సర్వే.. ఇలా మూడు సర్వేలు చేయాలని ఏఐసీసీ రాష్ట్ర పార్టీకి ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఖైరతాబాద్ రేసులో దానం నాగేందర్ తో పాటు విజయా రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు కేకే ఫ్యామిలీ, మరి కొంత మంది నేతలు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏఐసీసీ టిక్కెట్ల ఎంపికను సీరియస్ గా తీసుకుంది. ఇక బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మిగతా 8 మంది అంశంపై కూడా ఏఐసీసీ ఆరా తీసింది. వారిపై పడే ప్రభావం, పరిస్థితులు, ఉప ఎన్నికలు వంటి అంశంపై కూడా అగ్రనేతలు ఆరా తీశారు.

ఇక దానం నాగేందర్ కు టిక్కెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా అధిష్టానం ఆరా తీసినట్లు పార్టీలోని ఓ ముఖ్య నేత తెలిపారు. పార్టీ లో ప్రాధాన్యత పోస్టు ఇవ్వడం వలన కాంప్రమైజ్ అవుతారా? లేదా అనే అంశాలపై కూడా డిస్కషన్ జరిగినట్లు తెలిసింది. మరోవైపు దానం మాత్రం తప్పనిసరిగా తాను పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఒక వైపు కాంగ్రెస్ లో టిక్కెట్ పొందేందుకు చాలా మంది నేతలు రేసులో ఉండగా, మళ్లీ దానంకు ఇవ్వాలా? అని కొంత మంది పార్టీ పెద్దలు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాఫిక్ గా నిలిచింది.