ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ‘ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్వో)’ కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పేరుతో గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కోసం ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025’ కింద గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. పాత జాబితాలో 8వ సీరియల్ నంబర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అక్కడి నుంచి తొలగించి, కొత్తగా 17వ సీరియల్ నంబర్‌లో “ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అమరావతి” పేరుతో చేర్చారు. ఈ కార్యాలయం పరిధిలోకి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుంది.

ఈ కొత్త ఎఫ్ఆర్ఆర్వో ఆఫీస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే విదేశీయుల నమోదు, వారి వీసాల పొడిగింపు, వీసా మార్పిడులు, ఇతర ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా రాష్ట్రానికి పర్యటనలు, పనుల నిమిత్తం వచ్చే విదేశీ ప్రతినిధులు, అధికారులకు ఈ కార్యాలయం ఏర్పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.