మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్..!

జూరాల నీటి విషయంలో రైతులను తప్పుదోవ పట్టించొద్దని, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా కొందరి తీరు కనిపిస్తోందని మంత్రి జూపల్లి కృష్టారావు అన్నారు. ఒక టీఎంసీ నీటికి ఎంత బాష్పీభవనం (ఆవిరి) జరుగుతుంది? ప్రాజెక్టులో ఎంత నీరు అందుబాటులో ఉంది? ఇన్‌ఫ్లో ఎంత వస్తోంది? అవుట్‌ఫ్లో ఎంత ఉంది? కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? అనే వాస్తవాలను పరిశీలించకుండా మాట్లాడటం సరికాదని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.

రైతులను కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. కావాలంటే జూరాల నీటి లెక్కలను అధికారులతో కలిసి పరిశీలించండని అన్నారు. వాస్తవాలు తెలుసుకోండి. రైతులను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ఒక్క చుక్క నీరు కూడా పెరగదని అన్నారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని, వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, విడుదల వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేయాల్సి ఉంటుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేయడం లేదు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నీటి లభ్యతపై వాస్తవాలు చెప్పకుండా హడావుడి చేయడం, రైతుల్లో ఆందోళన కలిగించడం బాధ్యతారాహిత్యం అని మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు.

నీటి విషయంలో రాజకీయాలు కాదువాస్తవాలు, లెక్కలు, శాస్త్రీయ విధానం ముఖ్యం. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకునేలా ప్రభుత్వం అవసరమైన సూచనలు, చర్యలు తీసుకుంటుందని, రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు.