సిలబస్ మార్పుపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. అభ్యర్థులకు ఊరట..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక స్పష్టతనిచ్చింది. పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు చేస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు కమిషన్ తెరదించింది. సిలబస్ మార్పుపై అభ్యర్థుల నెలకొన్న ఆందోళనలు, వారి నుంచి వెల్లువెత్తుతున్న వినతుల నేపథ్యంలో టీజీపీఎస్సీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సిలబస్‌ సమీక్ష కోసం ప్రస్తుతానికి ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పోటీ పరీక్షల సిలబస్‌లో ఏవైనా భారీ మార్పులు చేపట్టాల్సి వస్తే, ఆ విషయాన్ని కనీసం ఏడాది ముందే అభ్యర్థులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా అభ్యర్థులు మారిన సిలబస్‌కు అనుగుణంగా సిద్ధమవడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా, ఏవైనా స్వల్ప మార్పులు లేదా చేర్పులు అవసరమైతే, ఆ వివరాలను సంబంధిత ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌తో పాటే వెల్లడిస్తామని వివరించారు. సిలబస్ మార్పుపై అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందవద్దని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా సూచించారు. కమిషన్ ఇచ్చిన ఈ స్పష్టతతో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది.