భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసే విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, క్రీడాకారులు దాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశాడు. ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించడం మినహా ఆటగాళ్లకు మరో మార్గం లేదని తేల్చి చెప్పాడు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ క్రీడాకారులతో కరచాలనం చేయడానికి, ఆ దేశ అధికారుల చేతుల మీదుగా ట్రోఫీలు అందుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్పందిస్తూ “పాకిస్థానీ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయకూడదని భారత ప్రభుత్వం ఆదేశిస్తే, ఆటగాళ్లు దాన్ని కచ్చితంగా అనుసరించాల్సిందే. ప్రభుత్వం చెప్పినట్లు వినడం వారి బాధ్యత” అని పేర్కొన్నాడు. గత రెండు ఆసియా కప్లలోనూ ఇదే వైఖరి కొనసాగిన విషయాన్ని గుర్తుచేశాడు. మహిళల ఆసియా కప్ విజేతగా నిలిచిన అనంతరం భారత జట్టు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించన సంగతి తెలిసిందే.
మరోవైపు, పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఆయన పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరాడు. “కనీసం ఇమ్రాన్ ఖాన్ పట్ల మానవత్వం చూపండి. ఆయనకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నదే మా కనీస డిమాండ్” అని కపిల్ విజ్ఞప్తి చేశాడు.