హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా బస్‌స్టాప్‌ల స్థానాల్లో మార్పులు చేపట్టే అంశంపై ఆర్టీసీ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. త్వరితగతిన రీ-షెడ్యూల్ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రెండు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉన్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్‌స్టాప్‌లను అవసరమైన ప్రాంతాలకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.
జూబ్లీహిల్స్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం 6 గంటల నుంచే వన్‌వే విధానం అమల్లోకి వచ్చింది. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రెన్స్ వద్ద ఎడమవైపు, అంటే క్యాన్సర్ ఆసుపత్రి మార్గం వైపు మళ్లాల్సి ఉంటుంది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలకు మాత్రమే నేరుగా వెళ్లేందుకు అనుమతి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.