జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సెల్‌ఫోన్.. ఆకస్మిక తనిఖీల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం

ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆయన వద్ద సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ లభించినట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు వెల్లడించారు. జైలులో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ పరికరాలను గుర్తించినట్లు సమాచారం.

అధికారుల తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ తన దుస్తుల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా దాచుకున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్, ఛార్జర్, ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జైలు భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హై-ప్రొఫైల్ ఖైదీ వద్దకు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా చేరాయి, వాటిని ఎవరు అందించారు అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న పరికరాల్లోని సమాచారాన్ని పరిశీలించడంతో పాటు, జైలులోకి వాటి ప్రవేశానికి సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.