కామన్వెల్త్ గేమ్స్‌లో మురళి శ్రీశంకర్ చరిత్ర.. వరుసగా రెండోసారి సిల్వర్ మెడల్

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ అథ్లెట్ మురళి శ్రీశంకర్ మరోసారి తన సత్తా చాటాడు. గ్లాస్గోలో జరిగిన పురుషుల లాంగ్ జంప్ పోటీల్లో 8.09 మీటర్ల దూరం దూకి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో భారత్‌కు మరో పతకాన్ని అందించడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ప్రత్యేక రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ లాంగ్ జంప్ విభాగంలో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా మురళి శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. గతంలో 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆయన సిల్వర్ మెడల్ సాధించి భారత అథ్లెటిక్స్‌కు గర్వకారణంగా నిలిచాడు.

తాజా విజయంతో అంతర్జాతీయ వేదికపై మురళి శ్రీశంకర్ నిలకడైన ప్రదర్శన మరోసారి రుజువైంది. వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించడం భారత అథ్లెటిక్స్ చరిత్రలో అరుదైన ఘనతగా నిలవగా, ఆయనపై అభిమానులు, క్రీడా వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.