ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్లతో ఆమోదం తెలుపుతూ 21 కిలోమీటర్ల మేర సుందరీకరణ, పునరుద్ధరణ పనులకు టెండర్లు పిలిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు.
విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేసే సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అమలవుతున్న ఈ పథకాన్ని సిబ్బందికి కూడా వర్తింపజేయనుంది. వైద్య రంగంలో టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మొత్తం 6,278 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ సంస్థలు, గోదాములు, విద్యాసంస్థల నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్య రంగాల బలోపేతం, ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది.