తెలంగాణ ప్రభుత్వం మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, కొంతమంది వీఐపీలకు ఇప్పటివరకు కల్పిస్తున్న భద్రతా సౌకర్యాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఆధారంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్మెన్లు సహా పలు భద్రతా ఏర్పాట్లను రివ్యూ చేసి, అవసరం లేని చోట వాటిని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 31 మంది మాజీ, ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులకు భద్రత తగ్గించారు. ఈ మేరకు ఎస్కార్ట్ వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్ సరెండర్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం ప్రభావం పూర్తిగా తగ్గడం, ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ముప్పు స్థాయిని బట్టి మాత్రమే భద్రతా సౌకర్యాలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు దాదాపు రెండు దశాబ్దాలుగా అందిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 30న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, వారం రోజుల పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తొలగించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం మాజీ పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతా సౌకర్యాలను సమగ్రంగా సమీక్షిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.