భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం కేవలం ఆర్థికపరమైనదే కాదు, అది ఒక బలమైన సెంటిమెంట్. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏది జరిగినా ముచ్చటపడి ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో ఒక భాగం. కాబట్టి ప్రస్తుత ప్రజాస్వామ్య, సరళీకృత ఆర్థిక పరిస్థితుల్లో భారత్‌లో బంగారం కొనుగోలుపై పూర్తిగా నిషేధం విధించడం అనేది దాదాపుగా అసాధ్యమైన విషయం. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది తీవ్రమైన ఆర్థిక, సామాజిక పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి, భౌతిక బంగారంపై మోజు తగ్గించడానికి, దిగుమతుల భారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పన్నులు పెంచడం లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB) వంటి డిజిటల్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం లాంటి నియంత్రణ చర్యలు మాత్రమే తీసుకుంటుంది కానీ, ఏకంగా కొనుగోళ్లనే నిషేధించే అవకాశం లేదు.
అయితే, భారతదేశ చరిత్రలో సామాన్యులు బంగారం కలిగి ఉండటంపై కఠినమైన ఆంక్షలు విధించిన సందర్భం గతంలో ఒకటి ఉంది. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు అప్పటి ప్రభుత్వం 1963లో ‘గోల్డ్ కంట్రోల్ రూల్స్’ (Gold Control Rules) ను తీసుకొచ్చింది. ఆ తర్వాత 1968లో ‘గోల్డ్ కంట్రోల్ యాక్ట్’ ద్వారా దానిని కఠిన చట్టంగా మార్చింది. దీని ప్రకారం, సామాన్య ప్రజలు కానీ, వ్యాపారులు కానీ బంగారు బిస్కెట్లు, నాణేలు లేదా ముడి బంగారం రూపంలో తమ వద్ద ఉంచుకోవడం చట్టరీత్యా నేరం. కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే బంగారాన్ని కలిగి ఉండటానికి అప్పట్లో షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
కానీ, ఈ కఠినమైన చట్టం దేశంలో ఎన్నో అనర్థాలకు దారితీసింది. ముడి బంగారం నిల్వలపై నిషేధం, పాత ఆభరణాలను కరిగించి కొత్తవి చేయాలంటే ఎన్నో ఆంక్షలు ఉండటంతో లక్షలాది మంది స్వర్ణకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. మరోవైపు, ఈ చట్టం కారణంగా దేశంలోకి దొంగచాటుగా బంగారం స్మగ్లింగ్ భారీగా పెరిగిపోయి బ్లాక్ మార్కెట్ విపరీతంగా పుట్టుకొచ్చింది. చట్టం తీసుకువచ్చిన అసలు లక్ష్యం నెరవేరకపోగా మాఫియా, స్మగ్లింగ్ పెరగడంతో.. చివరకు 1990లో ఆర్థిక సరళీకరణల సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ ‘గోల్డ్ కంట్రోల్ యాక్ట్’ను పూర్తిగా రద్దు చేసింది. ఆనాటి చేదు అనుభవాల దృష్ట్యా, మళ్లీ అలాంటి నిషేధాన్ని విధించే సాహసం భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎన్నటికీ చేయవనేది ఆర్థిక నిపుణుల స్పష్టమైన విశ్లేషణ.