ఏపీలో మరో కొత్త విమానాశ్రయం: కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తుని – అన్నవరం ప్రాంతాల మధ్య ఈ ఎయిర్‌పోర్టును నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పారిశ్రామికంగా, పర్యాటక పరంగా జిల్లాకు భారీ ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కీలక ఆదేశాలు జారీ చేసింది. తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. భూసేకరణ, సాంకేతిక అంశాలు మరియు పర్యావరణ ప్రభావాలపై నిశితంగా పరిశీలించి త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాను విమాన మార్గంతో అనుసంధానించాలన్న లక్ష్యంతో ఏపీఏడీసీఎల్ సుమారు 9 కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకోగా, ఇప్పుడు కాకినాడ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్టు ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రయాణికులకు విశాఖపట్నం లేదా రాజమండ్రి వరకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *