కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలను అడుగడుగునా ఎదుర్కొందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఆయన నిర్వహించారు. అనంతరం ట్యాంక్ బండ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2024 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ ని బందీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడ్ని సంకెళ్లలో పెట్టి ఎవరినీ వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ బంధించిందని ఆరోపించారు.
అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనేది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1000 గురుకుల పాఠశాలలు నిర్మించిందని గుర్తుచేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ ను ఎంతగానో ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు.
మరోవైపు కేసీఆర్ దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్కీమ్ కి ‘అంబేద్కర్ అభయహస్తం’ అని పేరు పెట్టిందన్నారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు తేవాలంటే నాయకుడికి ‘ఖలేజా’ ఉండాలని అది కేసీఆర్ కు ఉందని ప్రశంసించారు. అటు కాంగ్రెస్ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు.
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత.. మే, జూన్ నెలల్లో ఎక్కడో ఒక దగ్గర ఎస్సీ, ఎస్టీల కోసం సభలు ప్రారంభిద్దామని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా కాంగ్రెస్ చేసిన ప్రామిస్‌ల మీద పకడ్బందీగా పోరాడాలన్నారు. మరోవైపు కేసీఆర్ 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్‌కు పెట్టారని, పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాబట్టి జై కేసీఆర్ నినాదంతో ముందుకు సాగుదామని కేడర్ కు పిలుపునిచ్చారు.