అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే..?

ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఈ నెల‌ 21తో ముగియనుండగా, ఆలోపే ఒక ఒప్పందానికి వచ్చేందుకు ఈ వారం చివరిలో మరో విడత చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ, ఇరు దేశాలు మళ్లీ భేటీ అయ్యేందుకు సుముఖంగా ఉన్నాయని అమెరికన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

 

అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం ప్రకారం వాషింగ్టన్, టెహ్రాన్ ఈ వారం ప్రత్యక్ష చర్చలు జరపడంపై సమాలోచనలు చేస్తున్నాయి. చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయని మధ్యవర్తిత్వ దేశానికి చెందిన ఒక దౌత్యవేత్త చెప్పినట్లు ఏపీ పేర్కొంది. ఈ చర్చలు ఇస్లామాబాద్ లేదా జెనీవాలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వేదిక, సమయం ఇంకా ఖరారు కాలేదని, బహుశా గురువారం నాటికి భేటీ ఉండొచ్చని ఒక అమెరికా అధికారి తెలిపారు. సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… “ఒప్పందం చేసుకోవడానికి అవతలి పక్షమే మమ్మల్ని సంప్రదించింది” అని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. టెహ్రాన్ తమ డిమాండ్లకు తలొగ్గితే చర్చలు పునఃప్రారంభించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సంకేతాలిచ్చారు.

 

ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అమెరికా తరఫున వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘలీబాఫ్ పాల్గొన్నారు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం, దానిని తిరిగి తెరిపిస్తామని అమెరికా పట్టుబట్టడం, ఇరాన్ అణు కార్యక్రమం, టెహ్రాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. దీనికితోడు లెబనాన్‌లో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం కూడా కాల్పుల విరమణపై ప్రభావం చూపుతోంది.

 

“చర్చల మధ్యలో ఒక దశలో ఒప్పందం కుదురుతుందనే బలమైన ఆశ కలిగింది. కానీ, అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి” అని ఇస్లామాబాద్ చర్చల్లో పాల్గొన్న పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. ఈ నేపథ్యంలో జరగబోయే చర్చలైనా ఫలించి, యుద్ధానికి ముగింపు లభిస్తుందా? లేదా? అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *