తేది:13-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : మెదక్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల నిర్వహణలో పలు లోపాలు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో అధికారులు ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించిన ఫైళ్ల కదలిక సరైన విధంగా నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ఫైళ్లకు ఇన్వార్డ్ నమోదు ఉన్నప్పటికీ ఔట్‌వార్డ్ నమోదు లేకపోవడం గమనార్హమని తెలిపారు.
సమాచారం మేరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ లతీఫ్ ముజాహిద్దీన్ వద్దకు గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి మొత్తం 284 బిల్లులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అయితే అందులో 116 బిల్లులు సంబంధిత ఉన్నతాధికారులకు పంపాల్సి ఉన్నప్పటికీ ఇంకా పంపకపోవడం గుర్తించినట్లు తెలిపారు.
అదేవిధంగా కొన్ని ఫైళ్లను సరైన రికార్డులు నమోదు చేయకుండా నేరుగా అందజేస్తున్నట్లు కూడా తనిఖీల్లో తేలింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి సంబంధిత మెడికల్ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతను కూడా అధికారులు విచారించినట్లు సమాచారం.