చంద్రబాబుకు దేవుడంటే భయం,భక్తి లేదు: జగన్..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నిష్ఠతో నిర్వహించాల్సిన టీటీడీ పరిపాలనను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ధ్వజమెత్తారు.

 

నిష్కలంక వ్యక్తిత్వం ఉండాల్సిన చైర్మన్ పదవిలో అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టడం ఆలయ పవిత్రతను కాలరాయడమేనని విమర్శించారు. ఒక మహిళ తనను మోసం చేశాడంటూ ఎన్నికలకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. అదే వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని జగన్ ఆక్షేపించారు.

 

లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని జగన్ ఆరోపించారు. నెయ్యి నాణ్యత బాగోలేదని టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. అవే ట్యాంకర్లు మళ్లీ చంద్రబాబు హయాంలోనే వేరే పేర్లతో లోపలికి రావడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని సీబీఐ సమర్పించిన చార్జిషీట్లలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తాను తప్పులు చేస్తూ వాటిని ఇతరుల మీదకు నెట్టి రాజకీయ దుమారం రేపడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. దేవుడి పట్ల భయం.. భక్తి లేని వారు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

 

తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాను చంద్రబాబు తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. 2014-24 మధ్య కాలంలో కిలో నెయ్యి ధర సుమారు రూ. 300 వరకు ఉండగా.. ఇప్పుడు తన సొంత సంస్థ హెరిటేజ్‌కు చెందిన ఇందాపూర్ డెయిరీకి రూ. 658లకు కట్టబెట్టారని విమర్శించారు.

 

కిలోపై భారీగా లాభాలు ఆర్జిస్తూ టీటీడీ ఖజానాకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. భక్తి, శ్రద్ధ, నిష్ఠ లేని చంద్రబాబు పాలనలో తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసమే లడ్డూ నెయ్యిపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *