ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్ నెలకొంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిజాముద్దీన్ ఘటన ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఐదుగురు ఈనెల 15న ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నాక 17వ తేదీన విమానంలో హైదరాబాద్ మీదుగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఐదుగురిలో జనగామకు చెందిన ఇద్దరు అక్కడే ఉండిపోగా, ముగ్గురు మాత్రం ఇక్కడకు వచ్చారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ప్రైవేట్ పని చేసుకునే వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ముందే తెలుసుకున్న అధికారులు.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాము ఢిల్లీకి వెళ్లలేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుంచి వీరంతా హోం క్వారంటైన్లో ఉండకుండా, జనాల్లో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది.