కేబీసీ కోసం పాతికేళ్ల నిరీక్షణ: హాట్ సీట్ కోసం పెళ్లి చేసుకోలేదన్న కంటెస్టెంట్!

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా హాట్ సీట్‌పైకి వచ్చిన మిత్‌కుమార్ థక్రార్ అనే కంటెస్టెంట్ తన గురించి చెప్పిన ఒక ఆసక్తికర విషయం అమితాబ్‌తో పాటు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. తాను కేబీసీ హాట్ సీట్‌లో కూర్చోవాలనే లక్ష్యంతో గత 25 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయానని ఆయన వెల్లడించారు. ఈ పాతికేళ్ల నిరీక్షణ ఫలించి చివరకు షోకి రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మిత్‌కుమార్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. 2000వ సంవత్సరంలో తనకు ఒక పెళ్లి సంబంధం వచ్చిందని, అయితే తాను మొదట కేబీసీ హాట్ సీట్‌లో కూర్చున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి తెగేసి చెప్పానని వివరించారు. ఈ మాట విన్న అమితాబ్ ఆశ్చర్యపోతూ.. “అంటే ఆ అమ్మాయి కూడా మీ కోసం 25 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉందా?” అని ఆరా తీశారు. దానికి మిత్‌కుమార్ స్పందిస్తూ.. “లేదు సర్, ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్లయిపోయింది” అని బదులివ్వడంతో సెట్‌లో నవ్వులు పూశాయి.

పాతికేళ్ల క్రితం ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ సామాన్యుల జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇదే షోలో తన కొత్త సినిమా ‘తూ మేరీ మేన్ తేరా’ ప్రమోషన్ కోసం వచ్చిన నటి అనన్య పాండే కూడా కేబీసీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన తాతయ్య, నానమ్మలతో కలిసి సోమవారం నుండి శుక్రవారం వరకు క్రమం తప్పకుండా షో చూసేవాళ్లమని, తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు హాట్ సీట్‌పై కూర్చోవాలనే కల నేడు తనకు దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *