బతుకమ్మ చీరలకు బదులుగా దసరా గిఫ్ట్ లు..?

రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, వరాలను నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని పూర్తిచేసే లక్ష్యంతో ఉంది. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారిక చిహ్నాలు సైతం మార్చేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూలాలను సమూలంగా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టీఎస్ ను కాస్తా టీజీకి మార్చారు. కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టీజీ ప్లేట్ ఉండాలనే నిబంధన అమలుపరుస్తున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చాలనే యోచనలో ఉన్నారని అనుకుంటున్నారంతా.

దసరా కానుకలు

 

గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు ఎంతో ఆర్భాటంగా పంచేవారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు సంవత్సరమంతా పని కల్పించాలనే సదుద్దేశంతో ఏటా బతుకమ్మ చీరలు అంటూ వాటిని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి మహిళలకు కానుకలను పంచేవారు. అయితే అప్పట్లో ఈ చీరల క్వాలిటీ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. అప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా బతుకమ్మ చీరలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇక కాంగ్రెస్ మహిళా నేతలంతా కవితపై విరుచుకుపడ్డారు. కవిత ఇలాంటి చీరలు కడతారా అని ఎదురు ప్రశ్నించారు. దీనితో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం తలభారంగా తయారయింది.

ఆర్థిక అవకతవకలు

బతుకమ్మ చీరల ఆర్డర్ల విషయంలోనూ అవకతవకలు జరిగాయని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు ఈ అవకతవకలపైనా రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితిలో చీరల పంపిణీ చేస్తే తమ సర్కార్ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నాణ్యత, పంపిణీ వ్యవహారంలో తమ ప్రభుత్వానికి సైతం తిప్పలు తప్పవని భావిస్తున్న తరుణంలో మొత్తానికే బతుకమ్మ చీరల వ్యవహారాన్ని నిలిపివేసే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. అయితే ఒక్కసారిగా ఈ పంపిణీ నిలిపివేస్తే ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తోందట కాంగ్రెస్ సర్కార్. రేపు వచ్చే దసరాకు చీరల స్థానంలో వేరే ఇతర బహుమతులు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది రేవంత్ ప్రభుత్వం.

 

చీరలకు బదులు గిఫ్ట్ లు

 

బతుకమ్మ చీర ఖరీదులోనే ఈ గిఫ్టులు కూడా వాటి విలువకు తగ్గకుండా ఇవ్వాలని యోచిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఏమిస్తే మహిళలు ప్రసన్నం అవతారో అని ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వాలు అప్పట్లో పండుగల స్పెషల్ అంటూ రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే నెల కోటాను అదనంగా దసరా, దీపావళి,సంక్రాంతి, రంజాన్ పండుగలకు ఇస్తుండేవారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ మొదలయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *