‘వయనాడ్ బాధితుల కోసం 15 కోట్ల సాయం చేస్తా’.. కేరళ సిఎంకు ఆఫర్ చేసిన జైలు ఖైదీ..!

జైలులో ఖైదీగా ఉన్న సెలిబ్రిటీ మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశాడు. వయనాడ్ లో ప్రకృతి వైపరీత్యానికి గురైన బాధితులను ఆదుకోవడానికి తన వంతు సాయంగా రూ.15 కోట్లు సిఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తానని లేఖలో పేర్కొన్నాడు.

 

సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. పలువురు రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ సినీతారలతో సన్నిహిత సంబంధాలున్న ఈ కేటుగాడు గత కొన్ని సంవత్సరాలు జైలులో ఉంటూనే మీడియాలో పబ్లిసిటీ పొందేందుకు ఇలాంటి లేఖలు గతంలోనూ రాశాడు. అయితే కొన్నిసార్లు ఆ లేఖలు తను రాయలేదని మాటకూడా మార్చాడు.

 

అయితే ఈ సారి కేరళ సిఎంకు సుకేశ్ చంద్రశేఖర్ స్వయంగా లేఖ రాశాడని అతని లాయర్ అనంత్ మాలిక్ స్పష్టం చేశాడు. ఆ లేఖ ప్రకారం.. వయనాడ్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు 300 ఇళ్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపాడు.

 

“ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.15 కోట్లు అందిస్తాను. దయచేసి వాటిని స్వీకరించండి. ఈ రూ. 15 కోట్లకు అదనంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి 300 ఇళ్లు నిర్మించేందుకు వెంటనే మరింత ఆర్థిక సాయం చేస్తాను,” అని లేఖలో సుకేశ్ పేర్కొన్నాడు. తాను ఇచ్చే ధనమంతా చట్టపరంగా సంపాదించినదేనని, ఆ ధనాన్ని వయనాడ్ అభివృద్ధి, పునర్నిమాణ పనుల కోసం వినియోగించమని కోరాడు.

 

అయితే సుకేశ్ లేఖపై కేరళ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 400 మంది చనిపోగా.. 138 మంది ఆచూకీ తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *