ఆ రోజే మూడో విడత రుణమాఫీ..!

రాష్ట్ర రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో శుభవార్త చెప్పారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామంటూ ఆయన తెలియజేశారు. ఖమ్మంలోని వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పాల్గొననున్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణమాఫీ జరగనున్నదన్నారు. ఇది రైతుల అదృష్టమంటూ భట్టి పేర్కొన్నారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండిపోయారన్నారు. రుణమాఫీ చేసి ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో పడేశామన్నారు.

జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని తెలియజేసిన డిప్యూటీ సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం మొదటి దఫా రైతు రుణమాఫీ చేశామంటూ ఆయన స్పష్టం చేశారు. లక్షన్నర రూపాయల రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు వేశామన్నారు. మొత్తం 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ధి చేకూరిందన్నారు. రెండు దఫాలు కలిపి రూ. 12,289 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో రుణమాఫీనే కాదు, రైతు భీమాకు సంబంధించిన నిధులను కూడా పెట్టామంటూ ఆయన తెలిపారు.

 

మరోవైపు రైతుల ప్రీమియంను సైతం వైరా సభలోనే ప్రకటిస్తామని భట్టి పేర్కొన్నారు. దీని ద్వారా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రూ.1350 కోట్లను రైతు పంటల భీమాను రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. రూ. 72 వేల కోట్లను రైతు అనుబంధం ఉన్నవారికి కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *