ఆమ్జెన్ బయోటెక్‌ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం..

అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎక్జ్‌క్యూటివ్‌ సోమ్‌ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు.

 

ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్‌ అన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందన్నారు.

 

40 సంవత్సరాలుగా తమ కంపెనీ బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరింత సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయను నేషనల్ ఎక్జ్క్యూటివ్ గా నియమించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *