ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం: మంత్రి ఉత్తమ్ ప్రకటన..

రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టున ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పెట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని డెడ్ లైన్‌గా పెట్టి రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే రెండు దశల రుణమాఫీ పూర్తయింది. ఇక మూడో దశలో భాగంగా రూ. 2 లక్షల రైతు రుణాలను ఆగస్టు 15లోపు మాఫీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పంద్రాగస్టు రోజునే కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారా ఖమ్మం జిల్లా వైరా చేరుకుంటారని తెలిపారు. అక్కడ భోజనాలు చేసి వైరాలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. అంతకు ముందే సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

 

స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15వ తేదీనే ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని, సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్‌లను జాతికి అంకితం చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్బంగా వైరాలో లక్ష మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు. ఒక వైపు కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ సహా ఖమ్మం జిల్లాలో ప్రవహించనున్నాయని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన రైతు దినోత్సవంగా జరుపుకోబోతున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *