ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉండనుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ సెలవు దినాల్లో కాకుండా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఆగస్టు 14 వ తేదిన స్క్రూటీ ఉండగా.. ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అలాగే అదే రోజు తుది అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారు.
అలాగే ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉండనుంది. మొత్తం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో వైసీపీకి చెందిన ఓట్లు 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లాతోపాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ సభ్యులు ఓటర్లు ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేయగా.. కూటమి అభ్యర్థిగా ఇప్పటివరకు పేరు ఖరారు చేయలేదు.