బ్రాడ్‌కాస్ట్ బిల్లు.. మోదీ ప్రభుత్వంపై ప్రియాంక ఆగ్రహం..

మోదీ సర్కార్ కొత్తగా బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ పేరిట కొత్త బిల్లు తీసుకొస్తుందా? కొత్త చట్టం సోషల్ మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతుందా? డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫారమ్‌‌లపై కేంద్రం నిఘా ఉంచబోతోందా? సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? దీనిపై రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

 

మోదీ సర్కార్ తీసుకురానున్న బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రియాక్ట్ అయ్యారు. స్వతంత్రంగా మాట్లాడే, రాసే వారిని కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. సోషల్‌మీడియా X వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారామె.

 

ఇలాంటి చర్యలను దేశం ఏ మాత్రం సహించదన్నారు ప్రియాంకగాంధీ. ముఖ్యంగా వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యతల గురించి వివరించారు. ఈ రెండింటినీ మన పౌరులు పొందలేదంటూనే, వీటి కోసం ఏళ్ల తరబడి ప్రజలు పోరాడుతూనే ఉన్నారని గుర్తుచేశారు.

 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎక్కువగా వినియోగించు కుందని కమలనాధులు బలంగా నమ్ముతున్నారు. వీడియోల ద్వారా తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫారమ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి.

 

కొత్త బిల్లు ప్రకారం.. సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేసేవారు.. ముఖ్యంగా యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రాం, డిజటల్ క్రియేటర్లు తమ పేర్లను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అంతేకాదు కంటెంట్, వీడియోలు ఓ కమిటీ పరిశీలిస్తుంది. బిల్లు అమల్లోకి వచ్చిన నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

 

సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలు ఎప్పుడు అడిగినా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుం ది. దీనివల్ల ఇన్ ఫ్యూయోన్సర్ల సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఈ కారణంగా యూట్యూబ్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియాపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

 

కొత్త బిల్లుపై సమాచార, ప్రసార శాఖ అధికారులు పలువురు నిఫుణులతో సమావేశాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. సూచనలు, సలహాలు జరిపిన తర్వాతే బిల్లుకు తుదిరూపు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఢిల్లీ సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *