తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరో వైపు ప్రైవేటు పెట్టుబడులకు ఎర్ర తివాచీ పరిచి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయాలు తీసుకుంటున్నది. అలాగే.. నైపుణ్యాలు పెంపొందించి స్వయం ఉపాధి లేదా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ యువతను రాణించేలా కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లలో ఈ నెల 1వ తేదీనే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.

 

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌ను ప్రకటించారు. బిలియనీర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లోనే ఆయన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నదని వివరించారు.

 

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో తెలంగాణ స్కిల్ యూనివర్సీటికి శంకుస్థాపన చేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి.. ఆనంద్ మహీంద్రాను కలిశారు. ఈ భేటీ వెనుక కారణాలేమిటన్నవి ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉన్నాయి. తాజాగా, అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.

 

ముచ్చర్ల ఏరియాను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు మూడో మహానగరంగా తాము ముచ్చర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఫార్మా హబ్, ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఆ ఏరియాలో నిర్మిస్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *