ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఆ పార్టీ నేతలే..?

ప్రశాంత్ కిశోర్ గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. బిహార్‌లో ఆయన చేసిన జన్ సురాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మారుతుందని ఆయన ఇది వరకే ప్రకటించారు. బిహార్‌లో అన్ని పార్టీలు యాక్టివ్‌గానే ఉన్నాయి. ఆర్జేడీ, జేడీయూల మధ్య పోటీ తీవ్రంగా ఉండగా.. బీజేపీ ఈ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీల వైపు నిలబడుతుందా? లేక బీజేపీ, జేడీయూల దరికి చేరుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే, ప్రశాంత్ కిశోర్ తాజాగా తన పార్టీ రాజకీయ లక్ష్యాల గురించి ఓ హింట్ ఇచ్చారు.

 

‘ఈ అక్టోబర్ 2వ తేదీన జన్ సురాజ్ పార్టీని ప్రశాంత్ కిశోర్ ప్రారంభించట్లేదు. బిహార్‌లోని ఒక కోటి ప్రజలు కలిసి వచ్చి వారి పిల్లల భవిష్యత్ కోసం ఈ పార్టీని ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లను దింపేయడానికి, వేరే రాష్ట్రాలకు వలసలను నిలిపేయడానికి వారు ప్రజలే ఈ పార్టీని ప్రారంభిస్తారు. గతంలో నేను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలవడానికి సహకరించేవాడిని. పని చేసేవాడిని. పార్టీలు స్థాపించడానికి, ప్రచారం చేయడానికి పని చేశాను. కానీ, ఇప్పుడు నేను బిహార్ ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తాను’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అలాగే.. తాను ఈ పార్టీలో ఏ పదవినీ ఆశించడం లేదని స్పష్టం చేశారు.

 

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పని చేసి పార్టీని గెలిపించిన తర్వాత వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇతర పార్టీలకు కూడా ఆయన వ్యూహకర్తగా పని చేసి విజయాలు అందించారు. కొన్నిసార్లు ఆయన వ్యూహాలు ఫలితాలను ఇవ్వలేదు కూడా. కానీ, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ప్రశాంత్ కిశోర్ అనేంతగా ఆయన ఈ రంగంలో ముద్ర వేశారు.

 

నితీశ్ కుమార్‌ పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా పని చేసి విజయాన్ని అందించారు. అప్పుడు ప్రశాంత్ కిశోర్‌కు నితీశ్ కుమార్ కేబినెట్ హోదా ఇచ్చారు. రెండేళ్ల తర్వాత విభేదాలు వచ్చాక పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్‌ను బయటకు పంపించారు.

 

గత లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పని చేయడానికి ప్రశాంత్ కిశోర్ సంసిద్ధత చూపించారు. కానీ, ప్రశాంత్ కిశోర్ పెట్టిన డిమాండ్లు, కండీషన్లను కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో ఆయన పార్టీలో చేరలేదు. స్ట్రాటజీని అందించలేదు. ఆ తర్వాత బిహార్‌లో పాదయాత్ర మొదలు పెట్టి కొత్త పార్టీని స్థాపించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలతో సంబంధాలు గతంలో నెరపిన ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీని తన ప్రత్యర్థిగా తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

 

గాంధేయ వాదాన్ని తరుచూ వినిపించే ప్రశాంత్ కిశోర్‌.. లిబరల్ అని కొందరు.. కాదు అని మరికొందరు వాదిస్తుంటారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందాన్ని పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కరణ్ థాపర్‌తో ఇంటర్వ్యూ తర్వాత ఈ ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఏదేమైనా ఆయన రాజకీయ పార్టీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన రాజకీయ ప్రణాళిక, భావజాలం, లక్ష్యాలు ఏమిటనేది తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *