దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!

దళిత బంధు పథకం కొన్ని గ్రామాల్లో అమలైంది. తొలుత హుజురాబాద్‌లో అమలు చేసిన ఈ పథకానికి అప్పటి ప్రభుత్వం బ్రేకులు వేసింది. కొన్ని ఊళ్లల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్దిదారులను ఎంచుకున్నారు. అయితే, ఆది నుంచీ దళిత బంధు పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా, ఖమ్మం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళిత బంధు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఈ పథకం కింద విడుదలైన నిధులు దుర్వినియోగం అయ్యాయని తన దృష్టికి వచ్చినట్టు డిప్యూటీ సీఎం వివరించారు. కలెక్టర్ల తనిఖీల్లో ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ దుర్వినియోగంలో లబ్దిదారుల పాత్ర ఎంత ఉన్నదో.. ప్రత్యేక అధికారుల పాత్ర కూడా అంతే ఉంటుందని వివరించారు. అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఇలా పథకాన్ని నిర్వీర్యం చేసిన.. నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

డ్రైవింగ్ రాని వారికి కూడా కార్లు, జేసీబీ, ట్రాలీ, ట్రాక్టర్లు, ఇతరత్రాలు అందించినట్టు కలెక్టర్ల విచారణలో తేలింది. దళితుల జీవితాలు మార్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన పథకం ఇలా పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహించారు. దళితులు ఎందుకు వారికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదని? ఆ అవకాశంతో వారు ఎందుకు జీవితాలను మార్చుకోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. లబ్దిదారుల వద్దే వారు కోరుకున్న యంత్రాలు, ఇతరత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. వారంలోగా ఈ అంశంపై మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

 

ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లాకు చెందిన ఓ వీఆర్ఏ తనకు దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఇనుగుర్తి మండల కేంద్రంలో హైస్కూల్ ఆవరణలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు వీఆర్ఏ పప్పుల కుమార్. దీంతో పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని స్థానికుల సహాయంతో వీఆర్ఏను స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *